యానిమల్ రివ్యూ
నటీ నటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, శక్తి కపూర్, బాబీ డియోల్, త్రిప్తి
కథ – మాటలు – ఎడిటింగ్ – దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ట్రైలర్ తోనే ఇది ఫలానా దర్శకుడి సినిమా అని ట్రైలర్ తోనే అందరికీ ఆశక్తి కలిగేలా చేసిన సినిమా “యానిమల్”.
కథ:
బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఇండియా లోనే ఓక ప్రముఖ బిలియనీర్. అతడికి భార్యా, ముగ్గురు పిల్లలు. ఎంతసేపూ బిజినెస్ లో బిజీగా ఉండి తన ఫ్యామిలీ కి టైం ఇవ్వడు. అది మిగత ఇద్దరికీ ఏమీ అనిపించక పోయినా తండ్రి మీదే పిచ్చి ప్రేమ పెంచుకున్న కొడుకు (రణబీర్ కపూర్) మాత్రం ఇది తట్టుకోలేడు.
తన ఫ్యామిలీ లో ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా తట్టుకోలేడు. ఒక గొడవ వల్ల తను చిన్నప్పటి నుండీప్రేమించిన అమ్మాయి గీతాంజలి (రష్మిక) తో కలిపి అమెరికా వెళ్ళిపోతాడు. ఎనిమిదేళ్ళు గడుస్తాయి.
ఎనిమిదేళ్ళ తర్వాత తండ్రి బల్బీర్ సింగ్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని తెలిసి మళ్ళీ ఇండియా కి వస్తాడు. తర్వాత తన తండ్రి మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని ఏం చేసాడు, ఎలా చంపాడు అన్నది మిగతా సినిమా.
హైలైట్స్:
అర్జున్ రెడ్డి లో పెద్ద కథ ఏమీ లేక పోయినా స్క్రీన్ ప్లే తోటి, హీరో పాత్ర చిత్రీకరణ తోటి మూడు గంటల పాటు ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో హీరో పాత్ర చాలా వైల్డ్ గా ఉందన్న వాళ్లకి తన తర్వాత సినిమాలో ఇంకా వైల్డ్ హీరో ఉంటాడు అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. చెప్పినట్టుగానే సినిమా అంతా కూడా హీరో పాత్ర చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా రణబీర్ కపూర్ తన పాత్రకి తగినట్టు తన బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా మార్చుకున్నాడు. సింహం పక్కన కుందేలు పిల్లలా రష్మిక సరిగ్గా సరిపోయింది. ముఖ్యంగా ఇద్దరి మధ్యా వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా వైల్డ్ గానే ఉంటాయ్.
ఇక “విమానం లో సాగే అమ్మాయి పాట” అయితే మరో మూడ్ లోకి తీసుకు వెళుతుంది.
అవసరం అనిపించిన ప్రతీ చోటా ఎక్కడా మొహమాట పడకుండా లిప్ లాక్ లకి ఒకే చెప్పింది. ఇద్దరి మధ్యా ఉన్న రిలేషన్ చూపించడం ఇంతకన్నా తక్కువగా కుదరదు. అన్ని సన్నివేశాల్లో రణబీర్ కి ధీటుగా నటించింది.
యాంటి హీరోగా చేసిన బాబీ డియోల్ కూడా హీరో తో సమానంగా బాడీ పెంచి సరైన ప్రత్యర్థి గా అనిపించాడు. కాకపొతే స్క్రీన్ స్పేస్ ఇంకా ఎక్కువ ఉంటే బావుండేది.
అనిల్ కపూర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
చాలా కాలానికి శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా మంచి పాత్రల్లో కనిపించారు.
ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి యాక్షన్ సీన్స్. హోటల్ లో జరిగే షూటింగ్ లో ప్రత్యెక మెషిన్ గన్ వాడటం నుండి, క్లైమాక్స్ లో హీరో – యాంటి హీరో మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేసారు అనిపిస్తాయి.
ఈ సినిమాని తన భుజాల మీద హీరో, దర్శకుడు ఇద్దరూ సమానంగా మోశారు.
డ్రా బ్యాక్స్
ఈ సినిమాకి ఉన్న అతి ముఖ్యమైన డ్రా బ్యాక్ లెంగ్త్. దాదాపు మూడున్నర గంటల సమయం. కనీసం ఒక అరగంట తగ్గిస్తే బావుండేది. కానీ ఎడిటర్ డైరెక్టర్ ఒకడే కావడం వల్ల ప్రతీ సీన్ మీదా ప్రేమ ఉండటం సహజం.
ఇక మరో డ్రా బ్యాక్ ఇంటర్వల్ ముందున్న హై తర్వాత మెయింటైన్ చేయలేక పోయారు. సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అన్నీ ముందు సగం లో అయిపోయాయి. సెకండ్ హాఫ్ అంతా కూడా హీరో – హీరోయిన్ మధ్య, హీరో – హీరో తండ్రి మధ్య ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఆఖర్లో మళ్ళీ ఒక అరగంట యాక్షన్ సీన్స్.
మొత్తానికి సినిమా లో హీరో పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది అనుకుని వెళ్ళారో దానికి ఏ మాత్రం తగ్గకుండా హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో కళ్ళు తిప్పుకోకుండా కూర్చో బెడతాడు ఈ యానిమల్.
అన్నట్టు ఎండ్ టైటిల్స్ అయిపోయాక మరో ట్విస్ట్ ఇచ్చి పార్ట్ – 2 ఉందని కూడా హింట్ ఇచ్చాడు.